- మంత్రులు సురేఖ, పొంగులేటి, తుమ్మల, వాకిటి
హైదరాబాద్, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి చెప్పారు. భద్రాచలాన్ని అంతర్జాతీయస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామని, ఆలయ రూపురేఖలు మార్చేలా మాస్టర్‌ప్లాన్ రూపొందించామని చెప్పారు.
భద్రాచలం మాస్టర్‌ప్లాన్‌పై శుక్రవారం సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ ఛాంబర్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 200 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని, ఆగమశాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్‌తో పాటు మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని, భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కురవి వీరభద్రస్వామి, మల్లూరు నరసింహస్వామి ఆలయాలను సైతం అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
